అంబేద్కర్‌కు ఘన నివాళులు.. వైఎస్సార్ జయంతి వేడుకలు

బిజినపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. మిద్దె రాములు.

పయనించే సూర్యుడు జులై 9 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత ప్రజానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే వైఎస్సార్ సంక్షేమ పాలన స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, అల్లిపూర్ వెంకటస్వామి. అమృత్ రెడ్డి.మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి నజీర్, కత్తి ఈశ్వర్, బంగారి పర్వతాలు, మిద్దె సూరి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.