అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నేర్చుకోవడంలో గ్రామీణ విద్యార్థులు ముందుండాలి:

డాక్టర్ రఘు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్‌పల్లి జూన్ 14 మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కొంతమంది విద్యార్థులకే పరిమితమవుతోందని, అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని గ్రామీణ విద్యార్థులు టెక్నాలజీని నేర్చుకోవాలని డాక్టర్ రఘు సూచించారు. రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు (టెక్ స్కిల్స్) కలిగిన వారికి విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. మెట్‌పల్లిలోని ఐక్యూ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం నిర్వహించిన విద్యార్థుల సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐక్యూ సీఈఓ యాసిన్, ఎండీ మహ్మద్ బిస్మిల్లా ఆధ్వర్యంలో మూడు జిల్లాలకు చెందిన గ్రామీణ విద్యార్థులకు రెండు నెలల పాటు టెక్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణ ద్వారా అందించిన సర్టిఫికేట్లు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందుకు రావాలని, కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మీడియా వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ నైపుణ్యాలు ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా సమాజంలో గౌరవాన్ని కూడా తీసుకువస్తాయని పేర్కొన్నారు. కొత్త విషయాలు, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంలో ఎలాంటి రాజీ పడొద్దని విద్యార్థులకు సూచించారు. నైపుణ్యాలు కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు, జాబ్ ప్లేస్‌మెంట్ల విషయంలో తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.