అశ్వాపురం రైల్వే స్టేషన్ లో ప్రాణీకుల రైళ్ళను ఆపాలి

పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ కి వినతి పత్రం సమర్పించిన అశ్వాపురం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ లు

పయనించే సూర్యుడు, జూలై 06, అశ్వాపురం: గౌతమి నగర్ కాలనీలో అటామిక్ ఎనర్జీ ఉద్యోగుల సెమినార్ సందర్భంగా వచ్చిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ కి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో, అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు లు ఇద్దరు కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు పార్లమెంటు సభ్యుల తో మాట్లాడుతూ అశ్వాపురం మాజీ సర్పంచ్ శారద రెండువేల పదమూడు నుండి రెండు వేల యిరవై ఐదు వరకు అనేక సార్లు భద్రాచలం ఐటీడీఏ అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి అశ్వాపురం గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అశ్వాపురం రైల్వే స్టేషన్‌కు రోడ్డు వేసినట్టయితే చుట్టుపక్కల గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందని, పినపాక నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల వారు బస్సుల కంటే రైలు చార్జీలు తక్కువగా ఉండడం వల్ల ప్రయాణం సుఖంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు, హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగస్తులు, అధికారులు అశ్వాపురం నుండి మణుగూరు రైల్వే స్టేషన్‌కు రైలు ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. రాను,పోను సుమారు ముప్పై కిలోమీటర్లు సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆటోలలో ప్రయాణం చేయవలసి వస్తున్నది. రాత్రి సమయంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే అధిక ఖర్చుతో కూడుకున్న పని అవుతున్నది. హెవీ వాటర్ ప్లాంట్‌కు చెందిన బస్సు ప్రతిరోజు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా లాభదాయకంగా ఉంటుందని అనేకమార్లు ప్రజా ప్రతినిధులను, అధికారులను విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకు రోడ్డు పూర్తయినది. అశ్వాపురం గ్రామంలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ రైలు ఆగుటకు స్టాప్ లేదు. కనుక రైలు స్టాప్‌తో పాటు, కరోనా సమయంలో రద్దు చేయబడిన రైళ్లను కూడా పునరుద్ధరించాలని కోరినారు.