పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 3 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను కోరారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడి విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను అభ్యసించాలంటే ఇతర జిల్లాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన అనేక మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక సాంకేతిక విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తే అశ్వారావుపేటతో పాటు దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ, బీసీ, పేద కుటుంబాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన డిప్లొమా విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు పాలిటెక్నిక్ విద్య ఎంతో కీలకమని, ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. కళాశాల ఏర్పాటుతో స్థానిక యువతకు సాంకేతిక విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలించాలని ఎమ్మెల్యే కోరగా, ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జరిగితే గిరిజన ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి కొత్త దిశగా నిలుస్తుందని, సాంకేతిక విద్య ద్వారా స్థానిక యువత ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకునే అవకాశం కలుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.