“ఇద్దరూ ఒప్పుకుంటే వెంటనే విడాకులు సాధ్యమేనా?.. మ్యూచువల్ డైవర్స్‌పై అసలు చట్టం ఇదే”

ప్రముఖ లీగల్ కన్సల్టెంట్ పులగం రామకృష్ణారెడ్డి వివరణ..

పయనించే సూర్యుడు మే 29, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఇటీవల కాలంలో కుటుంబ వివాదాలు, మనస్పర్థలు, అహం సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో “మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్” అనే పదం సమాజంలో ఎక్కువగా వినిపిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ అంగీకరిస్తే అదే రోజు కోర్టు విడాకులు మంజూరు చేస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే చట్టం ప్రకారం మ్యూచువల్ డైవర్స్ అనేది కొన్ని నిర్దిష్ట నిబంధనలతో కూడిన చట్టపరమైన ప్రక్రియ అని లీగల్ కన్సల్టెంట్ పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి ప్రకారం భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలంటే ముందుగా కనీసం ఒక సంవత్సరం పాటు విడిగా జీవించి ఉండాలని ఆయన వివరించారు. అనంతరం కుటుంబ న్యాయస్థానంలో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో “ఫస్ట్ మోషన్” మరియు “సెకండ్ మోషన్” అనే రెండు దశలు ఉంటాయని ఆయన తెలిపారు. ఫస్ట్ మోషన్ సమయంలో భార్యాభర్తలు కోర్టు ముందు హాజరై ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని తెలియజేస్తారని చెప్పారు. అనంతరం సాధారణంగా ఆరు నెలల “కూలింగ్ పీరియడ్” ఉంటుందని, ఈ సమయంలో తిరిగి కలిసే అవకాశం ఉందా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుందని వివరించారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుల తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఆరు నెలల గడువును మినహాయించే అవకాశం కుటుంబ న్యాయస్థానాలకు లభించిందని పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. భార్యాభర్తలు చాలాకాలంగా విడిగా ఉంటూ, తిరిగి కలిసే అవకాశం లేకుండా, అలిమనీ, పిల్లల సంరక్షణ, ఆస్తి వంటి అంశాలు పూర్తిగా పరిష్కరించుకుని ఉంటే కోర్టు త్వరగా విడాకులు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పారు. “చనిపోయిన సంబంధాన్ని చట్టం బలవంతంగా కొనసాగించదు” అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే మ్యూచువల్ డైవర్స్ అనేది కోపంలో తీసుకునే నిర్ణయం కాదని, అది జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన చట్టపరమైన నిర్ణయమని అన్నారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, ఆర్థిక భద్రత, కుటుంబ గౌరవం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సరైన చట్టపరమైన అవగాహనతో ముందుకు వెళ్లాలని లాయర్ రామకృష్ణారెడ్డి సూచించారు.