ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవాని

పయనించే సూర్యుడు జులై 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన పీఆర్సీ (పి ఆర్ సి)ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవాని డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇప్పటికే 36 నెలలు పూర్తయినందున, సంబంధిత కమిటీ నివేదికను తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే అమలు చేయాలని ఆమె కోరారు. బుధవారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ విడతలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల విధివిధానాలను రూపొందించి నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలను రూపొందించి పర్యవేక్షణ అధికారుల పదోన్నతులు చేపట్టాలని కోరారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయడంతో పాటు సమ్మె కాలపు వేతనాలను మంజూరు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, బోధించే సబ్జెక్టుల వారీగా టెట్ నిర్వహించి సర్వీస్ వెయిటేజ్ కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, నోటు పుస్తకాలను తగినంతగా సరఫరా చేయడంతో పాటు విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తోటకూరి శ్రీను, జీడీఎస్వీ రమణ, ఉదారపు నాగేశ్వరరావు, భాగ్య, సునీత, సురేష్, శంకర్ రెడ్డి, ఖాదర్, మహేష్, పుల్లారావు, వెంకటేశ్వర్లు, ధర్మరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.