ఉమ్మడి నెల్లూరు జనసేన కమిటీ రద్దు.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం!

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా జనసేన పార్టీ బహిర్గతమైన విభేదాలు, వివాదాల తర్వాత... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ కమిటీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పేరుతో జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై జిల్లా నాయకులను బలపరిచామని, అయితే వారి వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పార్టీ జిల్లా నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణరాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితోపాటు, కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టుగా తెలిపారు.