ఎరువుల ధరలను తగ్గించాలి – తెలంగాణ రైతు సంఘం

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 16,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ అధికారికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకంతో సంబంధం లేకుండా రసాయన ఎరువులు అందించాలని, పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయ రంగానికి అవసరమైన డీజిల్‌ను ప్రభుత్వమే సబ్సిడీ ధరపై నేరుగా రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని, రబీ పంటకు సంబంధించిన ధాన్యం బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని, యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు ఎరువులు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటల విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు అయినాల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాలు, జొన్నలు వంటి పంటలకు మద్దతు ధరను ఒక్క కేజీకి కేవలం 10 నుంచి 12 పైసలు మాత్రమే పెంచిందని, అదే సమయంలో రసాయన ఎరువుల ధరలను కిలోకు రూ.12 వరకు పెంచిందని అన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వ్యవసాయ రంగానికి అవసరమైన పెస్టిసైడ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, కూలీల వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో వ్యవసాయం నష్టాల బాట పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం రైతులకు ఉపయోగపడకుండా బీమా కంపెనీల లాభాల పథకంగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ, దిగుమతి విధానాల కారణంగా పత్తి, మొక్కజొన్న తదితర పంటలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో దేశీయ మార్కెట్లో రైతుల ఉత్పత్తులకు ధరలు పడిపోయాయని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వరి ధాన్యానికి బోనస్ చెల్లింపును వాయిదా వేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు కళ్యాణపు కృష్ణయ్య, మండల కార్యదర్శి నల్లమోతు మోహన్‌రావు, పులి కృష్ణయ్య, అనుముల కృష్ణయ్య, చల్లా నాగేశ్వరరావు, తుమ్మలపల్లి వెంకటయ్య, గండమాల ఆనందరావు, కర్లకంటి శ్రీనివాసరావు, సోదా హనుమంతరావు, సుంకర కృష్ణయ్య, మన్నేపల్లి అర్జున్‌రావు, నారికొండ రవి తదితరులు పాల్గొన్నారు.