ఎల్పీజీ వినియోగదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి – జూన్ 30లోపు పూర్తి చేయాలని సూచన

పయనించే సూర్యుడు జూన్ 13, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : జిల్లా కలెక్టర్ ఖమ్మం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల విభాగం కీలక సూచనలు జారీ చేసింది. భారత ప్రభుత్వం, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) మరియు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాల కింద నమోదైన ఎల్పీజీ వినియోగదారులు అందరూ తప్పనిసరిగా 2026 జూన్ 30వ తేదీలోపు బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (ఈ-కేవైసీ) పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.నిర్దేశించిన గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు డీబీటీ, లక్షిత సబ్సిడీ పథకాల కింద అందించే ఎల్పీజీ సబ్సిడీ నిలిపివేయబడుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయకపోయినా గ్యాస్ సిలిండర్ సరఫరా కొనసాగుతుందని, కానీ సబ్సిడీ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.అందువల్ల జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు తమ సమీప గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి గడువులోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.