ఎల్.కోటలో ‘స్వచ్ఛ రథం’ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

జనం న్యూస్ ఎస్ కోట రిపోర్టర్ రావాడ నాయుడు (జూన్ 07): గ్రామాలను పారిశుధ్య రహితంగా, సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథం ప్రత్యేక వాహనాన్ని ఎల్.కోట మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించారు. వ్యర్థాలివ్వండి నిత్యావసరాలు తీసుకోండి అనే వినూత్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ రథం వాహనానికి ప్రజలు తమ ఇళ్లలోని పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజు సీసాలు, పాత పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, నూనె డబ్బాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అందజేయవచ్చు. గ్రామస్థులు సేకరించి ఇచ్చిన ఈ వ్యర్థాలను అక్కడికక్కడే తూకం వేసి, అందుకు సమానమైన నగదును లెక్కగట్టి, ఆ విలువకు సరిపడా నిత్యావసర సరకులను తక్షణమే అందిస్తారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ ఈ స్వచ్ఛ రథం వాహనంలో సబ్బులు, టూత్‌పేస్టులు, ఉల్లిపాయలు వంటి సుమారు 20 రకాల రోజువారీ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రతి గ్రామానికి వాహనం వెవస్తుందని గ్రామస్థులు ఈ అవకావాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ వినూత్న విధానం వల్ల ఒకవైపు గ్రామాల్లో వ్యర్థాలు తొలగిపోయి పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా మారుతుండగా, మరోవైపు ప్రజలకు తమ ఇంటి వద్దే వ్యర్థాల ద్వారా నిత్యావసర వస్తువులు లభించే సువర్ణావకాశం కలుగుతోంది. అదేవిధంగా ఈ వాహనాన్ని నడిపే స్థానిక వాహనదారుడికి సైతం చక్కటి ఉపాధి లభిస్తుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చాలని పిలుపునిచ్చారు.