పయనించే సూర్యడు జూన్.06.2026 అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 గిరిజన మండలాలను జోన్-I నుండి తొలగించే ఏ ప్రయత్నాన్నైనా గిరిజన సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని,ఇది గిరిజనుల రాజ్యాంగ హక్కులు,స్థానికత హక్కులు,ఉద్యోగ అవకాశాలపై ప్రత్యక్ష దాడిగా మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా హెచ్చరించారు.డుంబ్రిగూడ మండలం అరకు గ్రామంలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ…ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.గిరిజన ప్రాంతాల సహజ వనరులు,ఖనిజ సంపద,అటవీ సంపద,జల వనరులు దేశ అభివృద్ధికి వినియోగించుకుంటూ…అదే ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు మాత్రం ఉద్యోగాలు,అభివృద్ధి అవకాశాలు,హక్కులు దూరం చేయడం.అత్యంత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్,1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం,పీఈఎస్ఏ చట్టం,అటవీ హక్కుల చట్టం-2006 గిరిజనుల రక్షణ కోసం అమలులోకి వచ్చినప్పటికీ,ప్రస్తుతం జరుగుతున్న.పరిణామాలు ఆ చట్టాల ఆత్మకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో జోన్-Iలో కొనసాగడం వల్ల వేలాది మంది గిరిజన యువతకు ఉద్యోగాలు,విద్యా అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని,జోన్ మార్పుల వల్ల గిరిజన యువత భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడే ప్రమాదం ఉందన్నారు.ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు,మైనింగ్ కార్యకలాపాలు,పరిశ్రమల పేరిట గిరిజన భూములు,అటవీ వనరులు,జీవనాధారాలు ప్రమాదంలో పడుతున్నాయని,గ్రామ సభల అభిప్రాయాలను పక్కనబెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.గిరిజనుల ఉద్యోగ హక్కులు ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో గిరిజన ప్రాంతాలకు చెందిన బీజేపీ,టీడీపీ,జనసేన ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో గిరిజనుల ఓట్లు అడిగిన నాయకులు,నేడు గిరిజనుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు.ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.కూటమి రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అల్లూరి సీతారామరాజు జిల్లా 11 గిరిజన మండలాలను యథాతథంగా జోన్-Iలో కొనసాగించాలని,గిరిజన యువత ఉద్యోగ అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు.గిరిజనుల రాజ్యాంగ హక్కులు,స్థానికత హక్కులు,ఉద్యోగ రక్షణ,1/70 చట్టం,పీఈఎస్ఏ చట్టం,అటవీ హక్కుల చట్టాల అమలులో ఎలాంటి రాజీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే,గిరిజన ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.గిరిజనుల హక్కులు,ఉద్యోగ అవకాశాలు,భూములు,సహజ వనరులను కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు,పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి,కాంగ్రెస్ పార్టీ నాయకులు టి.నాగేశ్వరరావు,పోట్టండి హరి,గుంట డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.