కరివిరాలలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

పయనించే సూర్యడు జూలై 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా, కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తన స్వగ్రామమైన కరివిరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా తన వివరాలను నమోదు పత్రంలో పూరించి, సంబంధిత అధికారులకు అందజేశారు. ​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించడం ఇదే తొలిసారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 సార్లు ఈ ప్రక్రియ జరగగా, ప్రస్తుతం 14వ సారి చేపడుతున్నారని ఆయన వివరించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారిని చేర్చడం, అనర్హులను తొలగించడం మరియు అవసరమైన మార్పులు చేయడం ద్వారా దోషరహితమైన జాబితాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ​అర్హులైన ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహాలు లేకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ ఏజెంట్లు ప్రత్యేక చొరవ చూపాలని, ఓటర్లకు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.