పయనించే సూర్యుడు 29 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలో అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా తీర ప్రాంత గ్రామాల్లో గంటల తరబడి కరెంట్ కోతలు అధికారుల నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళ న కాట్రేనికోన మండలంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, దీనివల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) అధికారులు ఎలాంటి సమయపాలన లేకుండా తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. 2019 నుండి 2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యుత్ వ్యవస్థ ఎంతో మెరుగ్గా పనిచేసిందని, ప్రజలకు కరెంట్ కష్టాలు లేకుండా చూశామని, కానీ ప్రస్తుతం పరిస్థితి దారుణంగా తయారైందని నేతలు విమర్శించారు. తీర ప్రాంతాల్లో చీకట్లు ఫోన్ చేసినా స్పందించని అధికారులు: ఓఎన్జీసీ కంపెనీకి సంబంధించిన భారీ వాహనాల పనుల సాకుతో కాట్రేనికోన నుండి గచ్చకాయలపోర వరకు ఉన్న ప్రధాన రహదారిపై గంటల తరబడి విద్యుత్ లైన్లు నిలిపివేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. దీనివల్ల కాట్రేనికోన అర్బన్తో పాటు బూలావారిపేట, జిల్లెల్లవారిపేట, అడవిపేట, రేవువారిపేట, సత్తమ్మచెట్టు, గచ్చకాయలపోర, చిర్రయాణం, పల్లం, బలుసుతిప్ప తదితర తీర గ్రామాలు మరియు రూరల్ ప్రాంతాల్లో కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై కాట్రేనికోన విద్యుత్ కార్యాలయ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కనీసం సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడని ధ్వజమెత్తారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్: గ్రామాల్లో ఉన్న పాత 10 కేవీ, 15 కేవీ ట్రాన్స్ఫార్మర్లు లోడ్ ఎక్కువై తరచూ పేలిపోతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని నేతలు తెలిపారు. అధికారులు కేవలం తాత్కాలిక పరిష్కారాలకే పరిమితం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన కొత్త ఫోర్ పార్టీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం లేదా పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్న వెంటనే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిపాలన తరహాలోనే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.