పయనించే సూర్యుడు / జూన్ 13 / ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాప్రా, చర్లపల్లి చెరువుల రూపురేఖలు మారుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కలిసికట్టుగా శ్రమదానం చేసి చెరువులు, వాటి పరిసర ప్రాంతాలను శుక్రవారం శుభ్రం చేశారు. నీటి వనరులను కాలుష్య బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ.. జల వనరులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, చెత్తాచెదారాన్ని చెరువుల్లో గానీ, పరిసరాల్లో గానీ వేయవద్దని విజ్ఞప్తి చేశారు. చెరువులు కాలుష్యం కాకపోవడం వల్లే జంతుజాలం, జలచరాలు రక్షింపబడతాయని పేర్కొన్నారు. ఇళ్లలో చేరే చెత్తను విధిగా మున్సిపల్ ఆటోలకే అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే సహించేది లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ జవాన్లు రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్.ఎఫ్.ఏ నరేష్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.