కారేపల్లి మండల సర్వేయర్‌గా ఈ. వినయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

పయనించి సూర్యుడు న్యూస్ జూన్ 12 :(సింగరేణి రిపోర్టర్ నరేష్) కారేపల్లి, జూన్ 11: కారేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన మండల సర్వేయర్‌గా ఈ. వినయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై కారేపల్లికి వచ్చిన ఆయన మండల తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి జాయినింగ్ లెటర్ అందజేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో పరిచయం ఏర్పరుచుకుని తన విధులను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి కారేపల్లి మండల సర్వేయర్‌గా బదిలీపై వచ్చిన వినయ్ కుమార్‌కు రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూముల సర్వేకు సంబంధించిన సమస్యలు, వివాదాలు, హద్దుల నిర్ధారణ వంటి అంశాల్లో ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. మండల ప్రజలు తమ భూ సర్వే అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే, మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు నిబంధనలకు అనుగుణంగా సర్వే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, సమయపాలనతో సర్వే పనులు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా సేవలందించడమే తన లక్ష్యమని, మండల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వినయ్ కుమార్ వెల్లడించారు. ఆయన నియామకంతో మండలంలో భూ సర్వే పనులు మరింత వేగవంతం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.