కాలిపోయిన ఈత చెట్ల వనాలకు తక్షణ నష్టపరిహారం అందించాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

పయనించే సూర్యుడు కోరుట్ల మే 26. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం లో ఇటీవల అగ్ని ప్రమాదాల కారణంగా భారీ సంఖ్యలో ఈత చెట్లు కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఎంపీ అర్వింద్ లేఖ రాసినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాల వల్ల ఈత చెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సంవత్సరాల పాటు పెంచుకున్న ఈత చెట్లు కాలిపోవడం వల్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు వెంటనే సర్వే నిర్వహించి, బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని ఎంపీ అర్వింద్ కోరారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీ అరవింద్ విజ్ఞప్తి చేశారు.