పయనించే సూర్యుడు జూన్ 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ నగరంలోని కాలువలను ఆక్రమించి పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కాకినాడ నగర పాలక సంస్థ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ బుధవారం నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో కాలువలపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి జరిమానాలు విధించారు. నగరంలోని 20వ డివిజన్ మహాలక్ష్మీ నగర్ శివారు ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువపై పశువుల పాక నిర్మించినట్లు గుర్తించి, వెంటనే దానిని తొలగించాలని ఆదేశించారు. సంబంధిత యజమానికి రూ.3,000 జరిమానా విధించారు. అలాగే డివిజన్‌లోని ప్రధాన మేజర్ డ్రైనేజీలో పూడిక తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా స్థానికులు కాలువల శుభ్రత, పార్కు అభివృద్ధి, విద్యుత్ తీగల సమస్యలు తదితర అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాలువల శుభ్రత పనులు నిరంతరం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్కులో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఇంజినీరింగ్ విభాగం అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. విద్యుత్ తీగల సమస్యను సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. అనంతరం కమిషనర్ అన్నమ్మఘాటి సెంటర్‌లోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ ఏఈలు, డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.