కుషాయిగూడలో దారుణం: ప్రియురాలి నాలుక కోసిన నిందితుడు

పయనించే సూర్యడు / మే 25/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుభోదయ కాలనీలో ఒక వ్యక్తి తన సహజీవన భాగస్వామిపై కత్తితో దాడి చేసి నాలుక కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుభోదయ కాలనీకి చెందిన సుజాత పదేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ఆ తర్వాత నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా, గత ఆరు నెలలుగా వీరిద్దరూ కలిసి అదే కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో, ఆవేశానికి లోనైన నవీన్ కత్తితో సుజాతపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె నాలుకను కోయడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే సుజాత కుమారుడు డేవిడ్‌కు సమాచారం అందించారు. బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఆమెకు 18 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి కుమార్తె అమ్ములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.