పయనించే సూర్యుడు న్యూస్ :మే /28:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం సదాశివపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. కరీంనగర్ నగర పాలక సంస్థ 7వ డివిజన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామంలో మహిళ సంఘాల సభ్యులకు చీరలు, గ్రామానికి చెందిన ఏడుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం,అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడుతుంటే విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులు వాస్తవాలను గుర్తించి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.రైతు పండించిన ప్రతి గింజ కొంటామని, కొనుగోళ్ల విషయంలో అపొహలు వీడాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతులను కోరారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర లభించేలా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. రైతుల శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. రైతుల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలకు డాక్టర్ కవ్వంపల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఉప కమిషనర్ వేణుమాధవ్, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని, డివిజన్ అధ్యక్షుడు బండి మల్లేశం, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు ఏనుగు చుక్కారెడ్డి, రామిడి తిరుపతి, సింగిరెడ్డి మల్లారెడ్డిస ఎస్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.