పయనించే సూర్యుడు జూలై 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం వాలకపూడి పాముకుంట సెంటర్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డ్రైవర్ సోదరుల కోసం ఉచిత కంటి, గుండె వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కోరమాండల్ యూనిట్ హెడ్ కె. జగన్నాథం ప్రారంభించారు. ఈ శిబిరంలో 98 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా, 75 మందికి గుండె పరీక్షలు చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 70 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరో నలుగురికి కాటరాక్ట్ ఉన్నట్లు నిర్ధారించి, శ్రీకిరణ్ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స కోసం తేదీలు కేటాయించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ డ్రైవర్లు నిరంతర పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు, సీఎస్ఆర్ ప్రతినిధులు, కోరమాండల్ ఉద్యోగులు పాల్గొన్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించిన కోరమాండల్ యాజమాన్యానికి లారీ డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.