కోరమాండల్ ఆస్పత్రి వైద్య సేవలు అత్యంత ప్రశంసనీయం..

★ రూ. 20లకే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించడం గొప్ప శుభ పరిణామం.. ★ ఆస్పత్రిలో నూతన లాప్రోస్కోపిక్, ఎండోస్కోపి సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్..

పయనించే సూర్యుడు మే 28, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జిల్లా కలెక్టర్ ఎమ్.ఎన్. హరేంధిరప్రసాద్ గురువారం ఉదయం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వద్ద ఉన్న కోరమాండల్ ఆస్పత్రిని సందర్శించారు. ఇందులో భాగంగా ఆస్పత్రిలోని ఎమ్.ఆర్.ఐ విభాగాన్ని, ఐ.సి.యు., ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్ (చిన్నపిల్లలు), దంత, నేత్ర వైద్య వార్డులను జిల్లా కలెక్టర్.. కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన “లాప్రోస్కోపిక్, ఎండోస్కోపి” విభాగాలను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, ఇటువంటి కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణ ఆరోగ్య సమాజం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. కోరమాండల్ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా నిత్యం 500 మందికి, ఏడాదికి సగటున 1.20 లక్షల మందికి పైగా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇటీవల ఈ ఆస్పత్రిని విస్తరించి, 60 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడం శుభపరిణామమని కొనియాడారు. కేవలం రూ.20కే నామమాత్రపు కన్సల్టేషన్ ఫీజుతో ఎంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లనైనా సంప్రదించే సదుపాయం కల్పించడం, దీని ద్వారా రోజుకు 600 నుండి 700 మంది పేద ప్రజలు వైద్య సేవలు పొందడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులను అత్యంత సమర్థవంతంగా, అంకితభావంతో వినియోగిస్తూ వైద్య రంగంలో సరికొత్త మైలురాయిగా నిలిచిన కోరమాండల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మార్కెట్ ధరతో పోలిస్తే మూడింట ఒక వంతు ధరకే మందులు, డయాగ్నస్టిక్ పరీక్షలు అందించడం సంతోషకరమన్నారు. మురుగప్ప గ్రూపునకు చెందిన ఎ.ఎమ్.ఎమ్ ఫౌండేషన్ లాభాపేక్ష లేకుండా సామాన్యుడికి చేరువగా ఈ ఆస్పత్రిని నిర్వహించడం అభినందనీయమని, ఈ ఆస్పత్రి విస్తరణ ద్వారా ఇకపై ఏడాదికి సుమారు 5 లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోరమాండల్ ఇంటర్నేషనల్ కర్మాగారాన్ని సందర్శించారు. ప్లాంటులోని “బర్డ్స్ ప్యారడైజ్”ను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రక్రియ, పనితీరుపై అధికారులు డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టరుకు వివరించారు.

బాలికలకు ఋతు పరిశుభ్రత కిట్ల పంపిణీ..


నేడు ప్రపంచ ఋతు పరిశుభ్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట హైస్కూల్ బాలికలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఋతు పరిశుభ్రత కిట్లను మరియు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. మహిళలు, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై కోరమాండల్ సంస్థ తీసుకుంటున్న ఇటువంటి సామాజిక బాధ్యతాయుతమైన చర్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.

పర్యావరణ పరిరక్షణకు కోరమండల్ బర్డ్ పారడైజ్ కీలక పాత్ర..


కోరమండల్ "బర్డ్ పారడైజ్" ను సందర్శించిన జిల్లా కలెక్టరు, అక్కడి వాతావరణం, సౌకర్యాలను పరిశీలించి పర్యావరణ పరిరక్షణకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఇక్కడకు ఇతర ప్రాంతాల నుంచి "వలస పక్షులు" రావడం ఆనందంగా ఉందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణ ఒక భాగం అని, సహజ వనరులను, ముఖ్యంగా నీటిని పరిరక్షించాలని, ముందు తరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బాలికలతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్..


కోరమండల్ సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ బాలికలతో మాట్లాడుతూ పి.వి.సింధూ, ఎర్రాజి జ్యోతి వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. వ్యాయామం, క్రీడలలో నూటికి నూరు శాతం బాలికలు ఉత్సాహంగా పాల్గొని విజయాలు సాధించాలన్నారు. ప్రతి బాలిక ఐరన్ అధికంగా గల ఖర్జూరము వంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎమ్.జ్ఞానసుందరం, సీఎంఓ డా.ప్రబోద్ కుమార్, యూనిట్ హెడ్ కె.జగన్నాథమ్ సీనియర్ జీ.ఎమ్. (హెచ్.ఆర్) పి.పద్మనాభం, ఐసీడీఎస్ సీడీపీవో వై. లక్ష్మి, ఎ.జి.ఎమ్. (సి.ఎస్.ఆర్) వంశీకృష్ణ, ఏ.ఓ సి.హెచ్ సురేష్ బాబు, యశోద కృష్ణ, పీఆర్ఓ వి.రవికుమార్, జి.వి.సాయి కృష్ణ ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.