కోరుట్ల వెటర్నరీ కళాశాలలో ఘనంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

పయనించే సూర్యుడు ,కోరుట్ల జూలై 7. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వెటర్నరీ కళాశాల, కోరుట్లలోని వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ )లో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్, హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధులు జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులని వివరించారు. 1885 జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లౌయిస్ పాస్టర్ తొలిసారిగా రేబిస్ వ్యాక్సిన్ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది థీమ్ "ఒన్ వరల్డ్, ఒన్ హెల్త్ ప్రెవేంట్ జూనోసెస్" అని పేర్కొంటూ, జూనోటిక్ వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. రేబిస్ వంటి వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు సకాలంలో వ్యాక్సినేషన్ చేయించడం తప్పనిసరి అని సూచించారు. డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రేబిస్, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, టాక్సోప్లాస్మోసిస్, క్షయవ్యాధి, సాల్మొనెల్లోసిస్, బర్డ్ ఫ్లూ వంటి జూనోటిక్ వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపారు. పశువులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు, పందులు, కోళ్లను పెంచే వారు, పశువైద్య సిబ్బంది, విద్యార్థులు ఈ వ్యాధులకు ఎక్కువగా గురయ్యే అవకాశముందని చెప్పారు. ప్రజలు సంక్రమిత జంతువుల మాంసం, సరిగా ఉడకని గుడ్లు, అపరిశుభ్రమైన పాలను వినియోగించరాదని సూచించారు. అలాగే కుక్కలు, పిల్లులు, పాడి పశువులు, కోళ్లకు కాలానుగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా జూనోటిక్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన జూనోటిక్ వ్యాధులపై ప్రదర్శనశాలను సందర్శించి, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా 90కు పైగా కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశాంక్, డాక్టర్ అతిధి లోకవ్య రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ విశాల్, డాక్టర్ మోహిత, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.