గుంటూరు నుండి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా బెల్లం రవాణా – 500 కేజీల బెల్లం, 50 కేజీల పట్టిక, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

పయనించే సూర్యుడు,మే28: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి అధికారులు విశ్వసనీయ సమాచారంపై ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. తనిఖీల సందర్భంగా గుంటూరు ప్రాంతం నుండి మహబూబాబాద్ జిల్లా పరిసర తండాల్లో నాటుసారా తయారీదారులకు సరఫరా చేయుటకు అక్రమంగా రవాణా చేస్తున్న పది బస్తాలలో ఉన్న 500 కేజీల బెల్లం, 50 కేజీల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నేరానికి ఉపయోగించిన రెండు సెల్‌ఫోన్లు మరియు ఇతర సంబంధిత ఆధారాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

.

ఈ కేసులో నిందితులుగా:

కర్లపాటి స్వామి (డ్రైవర్), తండ్రి మురళి, నివాసం: మహబూబాబాద్ జిల్లా.

ఎస్. యాకూబ్ పాషా, నివాసం: కొండాపురం గ్రామం, మహబూబాబాద్ జిల్లా.

    వారిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    ప్రాథమిక విచారణలో నిందితులు గుంటూరు ప్రాంతం నుండి బెల్లం మరియు పట్టికను కొనుగోలు చేసి మహబూబాబాద్ జిల్లా పరిసర తండాల్లో నాటుసారా తయారీదారులకు సరఫరా చేయుటకు రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు, సరఫరాదారులు మరియు కొనుగోలుదారుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ దాడిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుంకరి రమేష్ పర్యవేక్షణలో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి టి. లత, సిబ్బంది ముత్తయ్య, ప్రవీణ్, శ్రావణ్, చిరంజీవి మరియు మల్లికార్జున్ పాల్గొన్నారు. అక్రమ నాటుసారా తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా మరియు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.