పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5:( సింగరేణి రిపోర్టర్ నరేష్) కారేపల్లి, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సింగరేణి మండలం గుట్టకిందగుంపు గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.9.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందజేస్తూ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరచేందుకు గోదాములు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణ పనులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తై, మొత్తం 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకుముందు గుట్టకిందగుంపు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ ఉండం రాఘవులతో కలిసి ప్రారంభించారు. అలాగే పోలంపల్లి–కోటిలింగాల వాగుపై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూదా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇంచార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, పర్స్ ట్రస్ట్ చైర్మన్ పట్టాభిరామారావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భూక్య రంజిత్, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.