చదువులమ్మకు తోడ్పాటునందించండి!

పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 3 కోరుట్ల పి.యం. శ్రీ జిల్లా పరిషత్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులతో బాసరలో ఐఐటీ సీటుసాధించిన ఓ నిరుపేద విద్యార్థినికి పలువురు బాసటగా నిలవాల్సిన అవసరం ఏర్పడింది. చదువులకు పేదరికం లేదని గుర్తెరిగి దీక్షగా చదివి నిన్నటి పదోతరగతి ఫలితాల్లో 574 మార్కులు సాధించి కోరుట్ల మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచింది లక్నం భానుజ్ఞ. కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అయిన భానుజ్ఞ కు బాసరలో ఐఐటీ సీటు వచ్చింది. కానీ కడు పేదరికం ఆమెను చదువుకు దూరంచేసే పరిస్థితి ఏర్పడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఊతమైంది. సుమారు 40వేల వరకు సమకూర్చి యునివర్సిటీలో జాయిన్ చేయడానికి సిద్ధమైనా ఆమొత్తం ఆమె చదువుల్ని కొనసాగించలేదు. అందుకే ఉదారత కల్గిన విద్యాభిమానులు, దాతలు స్పందించి ఆ అమ్మాయికి తోడ్పాటు నందించాలని పాఠశాల యాజమాన్యం కోరుతుంది. తల్లిదండ్రుల సంపాదన అంతంత మాత్రమే కావడంతో, ఏపూటకాపూట గడపడమే కష్టంగా ఉన్న తల్లిదండ్రులు ఈ చదులతల్లిని ఉన్నతచదువులకు దూరంచేయకముందే దాతలు స్పందించి నేరుగా ఆ అమ్మాయి అకౌంటికి విరాళాలు అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.