చింతకానిలో కొనసాగుతున్న వివోఏ ల సమ్మెకు పాతర్లపాడు ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ మద్దతు

పయనించే సూర్యుడు జూన్ 01,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గత 15 రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న గ్రామ దీపికలు (వివోఏలు)కు పాతర్లపాడు గ్రామ ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ దీపికలు గత 25 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారి కుటుంబాల పోషణకు ఆ వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా గ్రామ దీపికలకు నెలకు కనీసం రూ.25,000 వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సామాజిక భద్రతలో భాగంగా గ్రామ దీపికల కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, సీనియారిటీతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన వారిని ఎస్ ఈ ఆర్ పి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా (సీసీలు) పదోన్నతి ఇవ్వాలని సూచించారు. గ్రామ దీపికలకు అన్యాయం జరుగుతున్న జీవో నెం.58ను సవరించి వారి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ దీపికల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరిన దారెల్లి సురేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని వారి కనీస డిమాండ్లను నెరవేర్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మెలో పాల్గొంటున్న వివోఏలు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.