చింతకాని మండలంలో ధ్వంసమైన కల్వర్టుతో ప్రమాదకరంగా రహదారి – వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

పయనించే సూర్యుడు జులై 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. కల్వర్టు ఒకవైపు పూర్తిగా దెబ్బతినడంతో రహదారి అంచు కుంగిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాద స్థితిని గుర్తించడం కష్టంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు, పాఠశాల బస్సులు, రైతులు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుండటంతో వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ధ్వంసమైన కల్వర్టును పునర్నిర్మించి, రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.