పయనించే సూర్యుడు జూలై 8 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ చందంపేట మండలంలోని పలు గ్రామాల్లో నెల రోజులుగా నిలిచిపోయిన మిషన్ భగీరథ తాగునీటి సరఫరా – ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి చందంపేట మండలంలోని ఉమ్మడి పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గత ఒక నెల రోజులుగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం అత్యంత బాధాకరం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అయినప్పటికీ నెల రోజులుగా ప్రజలకు సక్రమంగా తాగునీరు అందక మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దైనందిన జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. నల్గొండ జిల్లా గతంలో ఫ్లోరోసిస్ సమస్యతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం కావడంతో, మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇలాంటి అంతరాయాలు ప్రజల్లో సహజంగానే ఆరోగ్యపరమైన ఆందోళనలను పెంచుతున్నాయి. అందువల్ల సమస్యను అత్యవసర ప్రజా సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చందంపేట మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పరిస్థితిని ప్రభుత్వం, సంబంధిత అధికారులు అత్యంత బాధ్యతతో పరిశీలించి, తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. సమస్యను ఇప్పటికే మిషన్ భగీరథ ఇంజినీర్-ఇన్-చీఫ్ ఈ ఎన్ సి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పై గ్రామపంచాయతీలలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు, సమస్యకు గల సాంకేతిక, పరిపాలనా కారణాలను గుర్తించి ఇకపై ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ప్రజల ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి చందంపేట మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా తాగునీటిని అందించాలి. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యపై ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం తగదు. రామావత్ మోహన్ కృష్ణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చందంపేట మండలం, దేవరకొండ నియోజకవర్గం