జహీరాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు: విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 7 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భారతదేశ మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మరియు నవభారత నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు సోమవారం పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన అద్భుతమైన సేవలను కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మరియు సామాజిక సమానత్వం కోసం ఆయన జీవితాంతం పట్టుదలతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రిగా మరియు దేశ ఉప ప్రధానిగా ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికి ముఖ్యంగా హరిత విప్లవం ద్వారా అన్నదాతల సంక్షేమానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని ఆయన యావత్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం మరియు సమాజంలో సమసమాజ స్థాపన కోసం మనమంతా పునరంకితం కావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండి మోహన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు శివప్ప, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.