పయనించే సూర్యుడు మే 23, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని బస్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం టిబి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా క్షయ నివారణ అధికారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జ్వరం, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి డిజిటల్ హ్యాండ్హెల్డ్ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పడటం, అలసట, మెడ లేదా చంకల్లో గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి పరీక్షలు మరియు మందులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, సరైన చికిత్సతో టీబీ పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. టీబీ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామాన్ని టిబి రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. గ్రామ సర్పంచ్ ఆవుల నరసింహారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ ముందుండి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వీరేందర్, హెల్త్ సూపర్వైజర్ కృష్ణారావు, టీబీ సూపర్వైజర్ ఇమామ్, రేచల్ రాణి, మహేష్ (ఎస్‌టీఎల్‌ఎస్), పీడియాట్రిక్ టీబీ అలర్ట్ గంటయ్య, ఏఎన్ఎం జయమ్మ, ఆశా కార్యకర్తలు జానమ్మ, సుజాత, నాగమణి, రాంబాయి, సంతోష్, జ్ఞానసుందరి తదితరులు పాల్గొన్నారు.