టెక్కలిపట్నంలో రైతులకు విత్తనాల పంపిణీ

★ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి . పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస మండలం టెక్కలిపట్నంలో నిర్వహించిన రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని రైతులకు విత్తనాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సదుపాయాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించి పంటల సాగు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని కోరారు. వ్యవసాయ శాఖ ఏడీఈ శారద మాట్లాడుతూ, రైతులు సంప్రదాయ వ్యవసాయ విధానాలతో పాటు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని అవసరానికి అనుగుణంగా పరిమితం చేసి, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే భూమి సారం పెరగడంతో పాటు, మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వ్యవసాయ అధికారి (ఏఓ) కిల్లి పోలారావు మాట్లాడుతూ, రైతులకు యూరియా, డి.ఎ.పి వంటి ఎరువులు ఆన్‌లైన్ విధానంలో అందజేయబడతాయని తెలిపారు. రైతుల ఆధార్ అనుసంధాన వివరాలు, ఈ-పంట నమోదులు, వారి పేరు మీద నమోదైన భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని ఎరువుల పంపిణీ జరుగుతుందని వివరించారు. అందువల్ల రైతులు తమ భూమి వివరాలు, ఈ-పంట నమోదులను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు.మండల పీఏసీఎస్ అధ్యక్షులు వంకల కుర్మారావు గారు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన వ్యవసాయ రుణ సదుపాయాలను సహకార సంఘాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ సూచనలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబు రావు, ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు ,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు , గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్ , వంకల కుర్మారావు , కుత్తుం లక్ష్మణరావు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.