టెట్ సిలబస్‌లో హేతుబద్ధ మార్పులు చేయాలి…

★ బోధించే సబ్జెక్టుకే ప్రాధాన్యం ఇచ్చి ఉత్తీర్ణత మార్కులు 50 కి తగ్గించాలి... ★ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి, వీలుకానట్లయితే ఆఫ్ లైన్ లో ప్రత్యేక టెట్ నిర్వహించాలి... ★ విరామ సమయంలో ఆర్.యు.పి.పి.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ-హిందీ ఉపాధ్యాయుల వినతి...

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూలై 09 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రస్తుతం అమలులో ఉన్న టెట్ సిలబస్‌లో హేతుబద్ధమైన మార్పులు చేసి, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుకే అధిక ప్రాధాన్యం కల్పించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గౌరవ అధ్యక్షులు అలకట్టు సత్యనారాయణ, శిక్షణలో ఉన్న హిందీ ఉపాధ్యాయులు బుధవారం ప్రభుత్వాన్ని కోరారు. అలాగే టెట్ ఉత్తీర్ణత మార్కులను అన్నివర్గాలఉపాధ్యాయులకు 50 కి తగ్గించి, 2028 గడువుకు ముందే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీక్లీ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైన జిల్లా స్థాయి హిందీ ఉపాధ్యాయుల మొదటి విడత మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో విరామ సమయంలో ఈ అంశంపై ఉపాధ్యాయులు చర్చించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్‌లో 150 మార్కుల్లో కేవలం 30 మార్కులు మాత్రమే తెలుగు, హిందీ సబ్జెక్టుకు కేటాయించి, సంబంధం లేని సోషల్ స్టడీస్‌కు 60 మార్కులు కేటాయించడం పూర్తిగా అశాస్త్రీయమని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టు ఆధారంగానే టెట్ సిలబస్ రూపొందించాలని, సంబంధం లేని సబ్జెక్టులతో పరీక్ష నిర్వహించడం వల్ల అనుభవజ్ఞులైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల టెట్‌లో 90 మార్కులు (60 శాతం) సంబంధిత సబ్జెక్టుకు, మిగిలిన 60 మార్కులు విద్యాశాస్త్రం, సాధారణ బోధనా నైపుణ్యాలు వంటి అంశాలకు కేటాయించేలా సిలబస్‌ను సవరించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం అమలులో ఉన్న అధిక ఉత్తీర్ణత మార్కులు సీనియర్ ఉపాధ్యాయులకు భారంగా మారాయని, దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మార్కులను 50 కి తగ్గించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏడాదికి రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గదేనని, అయితే పరీక్షల సంఖ్య పెంచడం మాత్రమే సరిపోదని అన్నారు. సిలబస్‌లో హేతుబద్ధమైన మార్పులు చేసి, ఉత్తీర్ణత మార్కులను తగ్గించి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దుచేయాలి వీలుకానట్లయితే ఆఫ్ లైన్ టెట్ నిర్వహించినప్పుడే వేలాది మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు నిజమైన భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. 2028 గడువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని అవసరమైన జీవో జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో వంగపల్లి సంపత్ కుమార్, కస్తూరి శ్రీధర్, శ్రీనివాస్, గంగాధర్, కిషోర్, దండె రాజేందర్, శంకర్, రమేష్, గోవింద్ నాయక్, పరమేశ్వర్, గోవర్దన్, నాగరాజు, శరత్ చంద్ర, యండి ఇక్బాల్, జయేందర్, శేఖర్, ప్రభాకర్, స్వప్న, సుజాత, సుల్తానా, సుజాత, లక్ష్మి, సరస్వతి, పద్మావతి, క్రిష్ణవేని, గీతారాణి, సరిత, శారద, హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.