పయనించే సూర్యుడు జూన్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తాడూర్, జూన్ 3: తాడూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ముందు బుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ, 24 గ్రామ పంచాయతీలు, 38,375 మంది జనాభాకు సేవలందిస్తున్న తాడూర్ పీహెచ్‌సీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. పీహెచ్‌ఎన్ కృపమ్మ డిప్యూటేషన్‌పై ఇతర మండలంలో విధులు నిర్వహిస్తుండగా, సూపర్వైజర్, యూడీసీ పోస్టులు కూడా పూర్తిస్థాయిలో భర్తీ కాలేదని తెలిపారు. వార్డు బాయ్, స్వీపర్ లేకపోవడం, ఆటోక్లేవ్ యంత్రం పనిచేయకపోవడంతో డ్రెస్సింగ్‌లు, డెలివరీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్లు జరిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆ సేవలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలానికి ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రిని 12 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, డిప్యూటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చెన్న శ్యాంసుందర్, చెన్న బాలరాజ్, అంతటి పరశురాములు, నరసింహ, రాములు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.