తాళ్లరాంపూర్‌లో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు

జనం న్యూస్, జూన్ 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో సోమవారం మృగశిర కార్తె (మిరుగు) సందర్భంగా చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గ్రామానికి చెందిన బెజ్జారం లింబాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 66 సంవత్సరాలుగా గ్రామంలో చేప మందు పంపిణీ సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్తమా, దగ్గు, దమ్ము వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప మందును తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చేప మందు తీసుకుంటారని చెప్పారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ చేప మందుపై ప్రజల్లో విశ్వాసం ఉండటంతో ప్రతి ఏడాది వందలాది మంది హాజరై మందును స్వీకరిస్తున్నారని, ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. చేప మందు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 99484 35903, 80740 35856 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.