తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్ :మే 31, తల్లాడ రిపోర్టర్ రాష్ట్రంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ను రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శనివారం అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా (డీఐఎల్ ఇండియా), ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా మరియు ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ సందర్భంగా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ కంట్రీ డైరెక్టర్ శ్రీ అంకుర్ గర్ న్యూఢిల్లీ నుండి జూమ్ ద్వారా పాల్గొని, తమ సంస్థ రైతుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి గారికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవలను రైతులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు మరియు వ్యవసాయ సూచనలను రైతులకు వాట్సాప్ ద్వారా చేరవేయనున్నట్లు మంత్రి తెలిపారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వాతావరణ అంచనాలను వినియోగించడం ద్వారా రైతులు సరైన సమయంలో సాగు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని, తద్వారా పంట నష్టాలను తగ్గించి ఉత్పాదకతను పెంచుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయ వృద్ధి, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. అనంతరం రాబోయే రుతుపవనాలు, వర్షపాతం పరిస్థితులకు సంబంధించి తొలి వాతావరణ సూచన సందేశాన్ని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వాట్సాప్ ద్వారా రైతులకు పంపించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, రైతులు నేరుగా వాతావరణ పరిస్థితులు మరియు వ్యవసాయ సూచనలకు సంబంధించిన ప్రశ్నలను వాయిస్ రూపంలో అడిగి సమాధానాలు పొందే విధంగా ఈ వేదికను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే ఈ సేవలను మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు విస్తరించే విధంగా అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కే. సురేంద్రమోహన్, ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీ బి. గోపి, సహకార శాఖ ప్రత్యేక సంచాలకులు శ్రీ రాహుల్ రాజ్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు, డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా మరియు ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కే. సురేంద్రమోహన్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాల సాధనలో భాగంగా కృత్రిమ మేధస్సును వినియోగించి రాష్ట్ర రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని తెలిపారు. రాబోయే కాలంలో ఎల్‌నినో, వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగు పద్ధతులను అవలంబించేందుకు రైతులకు ఖచ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని అందించే సామర్థ్యం ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థకు ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతు భరోసా నందు ఫోన్ నెంబర్ నమోదైన 17 జిల్లాలోని 304 మండలాలకు చెందిన 15 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందడం జరుగుతుంది