తెల్కపల్లి.తాడూరు. తహసీల్దార్ కార్యాలయాల నూతన భవనాలకు ₹7.63 కోట్ల నిధుల మంజూరు

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేశాం : ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు మే 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్, తాడూరు, తెల్కపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ₹7.63 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయ భవనాలు పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రెవెన్యూ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా అనేక అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి, నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రత్యేకంగా కృషి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నాగర్‌కర్నూల్, తాడూరు, తెల్కపల్లి తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి ₹7.63 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.