పయనించే సూర్యుడు, జూలై 3, బిజినేపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో దళారుల చేతిలో మోసపోయి సుమారు రూ.90 లక్షలు నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు. బాధిత రైతుల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం చెబుతూ, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, రైతులను మోసం చేసిన దళారులను వెంటనే అదుపులోకి తీసుకుని వారి నుంచి రైతుల డబ్బులు వసూలు చేయాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి విచారణ వేగవంతం చేయాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు. లైసెన్స్ లేని వ్యాపారులతో లావాదేవీలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాధిత రైతులకు త్వరలోనే వారి డబ్బులు అందేలా అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో బాధితుల్లో ధైర్యం, నమ్మకం పెరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజినపల్లి మండల అధ్యక్షులు మిద్దె రాములు తిరుపతయ్య ఎండి నజీర్ ఎండి ముక్తార్ బాలపిరు కత్తె ఈశ్వర్ డిప్యూటీ సర్పంచ్ మహేష్ మిద్దె సూరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు