దామలూరు వైరా నదిపై నిర్మించిన వంతెనకు _చెవిటికల్లు–వత్సవాయి రాష్ట్ర రహదారి విస్తరణ కూడా అనుసంధాన రహదారి నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు – త్వరలో జీవో విడుదల

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు జులై 8 చెవిటికల్లు–వత్సవాయి రాష్ట్ర రహదారి విస్తరణ కూడా చేపడతాం : ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) , నందిగామ శాసనసభ్యురాలు & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తో కలిసి నందిగామ మండలం దామలూరు కూడలి వద్ద వైరా నదిపై నిర్మాణం పూర్తయినప్పటికీ అనుసంధాన రహదారి లేక నిరుపయోగంగా ఉన్న వంతెనను ఆర్&బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ, చెవిటికల్లు–వత్సవాయి రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్-30)పై ఉన్న ఈ వంతెన ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలక అనుసంధానంగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీరులపాడు, నందిగామ మండలాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మధిర మండలం నుంచి వేలాది మంది ప్రజలు ఈ రహదారిపై నిత్యం ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న పైపు కల్వర్టు కొద్దిపాటి వర్షానికే నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడంతో పాటు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎత్తయిన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిందని, 2018 నాటికి పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో అనుసంధాన రహదారి నిర్మాణానికి వీరులపాడు మండలం పల్లంపల్లి రెవెన్యూ పరిధిలో కొంత భూసేకరణ అవసరమైందని తెలిపారు. భూసేకరణపై రైతు కోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల పనులు నిలిచిపోయాయని వివరించారు. తరువాత కోర్టు ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూమిని సేకరించవచ్చని అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అనుసంధాన రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా వదిలేసిందని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) , రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని పలుమార్లు కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.7.50 కోట్ల అంచనా వ్యయంతో వంతెనకు ఇరువైపులా 200 మీటర్ల చొప్పున అనుసంధాన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించిందని, మరో రెండు మూడు రోజుల్లో సంబంధిత జీవో విడుదల కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా అనుసంధాన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) కి ఎమ్మెల్యే తాతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, పొన్నవరం నుంచి వత్సవాయి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర ఉన్న చెవిటికల్లు–వత్సవాయి రాష్ట్ర రహదారి విస్తరణకు కూడా త్వరలో నిధులు సమకూర్చేలా ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి కృషి చేసి, ఈ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ పనులను కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంకి వీరాస్వామి, తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), ఆర్&బీ డిప్యూటీ ఇంజనీర్ పరశురాముడు, చెరుకూరు సాంబశివరావు, హైమారావు, గింజపల్లి శ్రీనివాసరావు, చల్లా తులసీరావు, చింతోటి సాంబశివరావు, మందా రమేష్, ఉప్పు కొండూరు గురుప్రసాద్, కొంకపాక వెంకట నరసయ్య, వేల్పుల భిక్షాలు, చల్లా శ్రీనివాసరావు, చీదిరాల భరత్ రెడ్డి, జొన్నలగడ్డ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.