దొమ్మాట యువతకు ఆర్మీలో చోటు

"ముగ్గురు యువకులకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ అంజయ్య"

పయనించే సూర్యుడు మే 2 రాజేష్ దౌల్తాబాద్ ): దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు భారత ఆర్మీలో ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆర్మీలో ఎంపికైన భాషమైన అఖిల్, పొగాకు ప్రసాద్, బ్యాగరి రవీందర్‌లను గ్రామ సర్పంచ్ దేవిగారి అంజయ్య ఆదివారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాలు కప్పి, పూలమాలలతో యువకులను సత్కరించారు. అనంతరం సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఆర్మీ కోచింగ్ కోసం తనను సంప్రదించిన యువకులకు అవసరమైన సహకారం అందించామని, వారు ఎంతో తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణమని అన్నారు. గ్రామ యువతకు వీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. దొమ్మాట గ్రామం నుంచి ఇప్పటికే ఏడుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు ఆర్మీ జవాన్లు వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని, తాజాగా మరో ముగ్గురు యువకులు ఆర్మీలో ఎంపిక కావడం గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచిందని పేర్కొన్నారు. యువత మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కష్టపడి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆర్మీలో ఎంపికైన యువకుల విజయాన్ని గ్రామస్తులు అభినందిస్తూ వారి భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్ హైమద్, గ్రామ యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.