జనం న్యూస్ జూన్ 6 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి మహాదేవపూర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహాదేవపూర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ల మూడో విడత కొనసాగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. కళాశాలలో బి.ఏ., బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.ఎస్సి (బీజెడ్సి), బి.ఎస్సి (ఎంపీసీఎస్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్య, ఆధునిక బోధనా పద్ధతులు, కెరీర్ మార్గదర్శకత్వం మరియు పోటీ పరీక్షల కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించబడుతున్నాయని పేర్కొన్నారు. మహాదేవపూర్, పలమేల , కాటారం, మహాముత్తారం, మల్హర్రావు తదితర మండలాలకు చెందిన విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా లేదా కళాశాలలోని దోస్త్ హెల్ప్ డెస్క్ సహాయంతో ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సమృద్ధిగా పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన ఆటస్థలం, పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన విద్యా వాతావరణం విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్, పర్యావరణ మరియు అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ల మూడో విడతకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 15-06-2026 అని తెలిపారు.