దౌల్తాబాద్‌లో సంధ్య పౌల్ట్రీ ఫారం నిర్మించోద్దని గ్రామస్తుల వ్యతిరేకత

"పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామ ప్రజలు హెచ్చరిక"

పయనించే సూర్యుడు జులై 8 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జంగాపల్లి వెళ్లే రహదారి మార్గంలో ప్రతిపాదించిన సంధ్యా పౌల్ట్రీ ఫారం ఏర్పాటుపై గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 227/ఆ/1/3, 227/ఈ/1/3లో సుమారు 4 ఎకరాల 19 గుంటల భూమిలో కోళ్ల ఫారం నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పిస్తూ, నివాస ప్రాంతాలకు సమీపంలో పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసన, కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎం.జె.పి. హాస్టల్‌లో విద్యార్థులు నివసిస్తున్నారని, సుమారు 150 మీటర్ల దూరంలోనే వసతిగృహం ఉండటంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, వాగు ప్రవాహ మార్గం, గ్రామ పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పౌల్ట్రీ ఫారం నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అనుమతులు ఇచ్చి ఉంటే వాటిని పునఃపరిశీలించి నిర్మాణాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ ఫారం ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, గ్రామ సంక్షేమానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు స్పందించి పౌల్ట్రీ ఫారం ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.