పయనించే సూర్యుడు జబ్బర్ కామారెడ్డి కాంసెన్సీ ఇంచార్జి. కామారెడ్డి జిల్లా, జూన్ 03: కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఎరువుల ధరల పెంపులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి శివ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించడంతో పాటు పేదలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను మినహాయించాలని ఆయన సూచించారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధ హోదా కల్పించి, డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ సిఫార్సు చేసిన సీ–2 వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా హామీ ఇవ్వాలని కోరారు. పండ్లు, కూరగాయలతో సహా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని శిక్షార్హ నేరంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ (సీఏసీపీ)కు చట్టబద్ధ హోదా కల్పించాలని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.20 వేల సామాజిక భద్రతా పెన్షన్ అందించాలని, రైతులు మరియు వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. మహిళలు, ఆదివాసీలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యలను అరికట్టి రాజకీయ ప్రభావాలకు అతీతంగా దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ, సీబీఐ వంటి సంస్థల దుర్వినియోగాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీలు, మూల్యాంకన కుంభకోణాలపై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికులకు మెరుగైన వేతనాలు, ఉపాధి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక ప్రాంతాల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను వేధించడం ఆపి వారికి న్యాయం చేయాలని కోరారు. అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ ఇరాన్, వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద జోక్యాలను, క్యూబాపై బెదిరింపులను ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా నాయకులు నరేందర్, రఘుపతి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.