02 Nov 2026 | 11:41 PM

నకిలీ వరి విత్తనాలు విక్రయించిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నష్టపోయిన రైతుకు తక్షణమే పరిహారం అందించాలి: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకట రామారావు

పయనించే సూర్యుడు న్యూస్, నవంబర్ 3, తల్లాడ, జర్నలిస్ట్ బాబురావు ఈ వర్షాకాల సీజన్‌లో నకిలీ వరి విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన బిల్లుపాడు గ్రామానికి చెందిన రైతు ఉప్పెర్ల శ్రీను సమస్యను సోమవారం తల్లాడలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకట రామారావు తెలిపారు. రైతు శ్రీను తిరువూరు పట్టణంలోని గణపతి సీడ్స్, విత్తన దుకాణంలో కె యన్ యం -1638 వరి వంగడం విత్తనాలను కొనుగోలు చేసి తన పొలంలో సాగు చేసినట్లు తెలిపారు. సాధారణంగా ఈ వరి రకం సుమారు 130 నుంచి 135రోజులకు కోతకు రావాల్సి ఉండగా, రైతు పొలంలో సాగు చేసిన పంట కేవలం 60 రోజుల్లోనే చిన్నచిన్న కంకులు వేసి, ఆశించిన దిగుబడి లేక పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈ వంగడం ఎకరాకు సుమారు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఈ పంట ద్వారా కనీసం 5–6 బస్తాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల నాణ్యతపై దుకాణ యజమానిని సంప్రదించగా, సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు రైతు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రైతు కొనుగోలు చేసిన విత్తనాల నమూనాలను, బిల్లులను మరియు పంట పరిస్థితిని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి శాస్త్రీయంగా విచారణ నిర్వహించాలని ఆపతి వెంకట రామారావు డిమాండ్ చేశారు. విత్తనాలు నకిలీవని లేదా నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని నిర్ధారణ అయితే, వాటిని విక్రయించిన దుకాణ యజమానిపై విత్తన చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాల కారణంగా రైతు పెట్టుబడి మాత్రమే కాకుండా, మొత్తం పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల రైతుకు జరిగిన వాస్తవ నష్టాన్ని అధికారులు అంచనా వేసి తగిన నష్టపరిహారాన్ని విత్తన విక్రయదారుడి నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తూ నకిలీ లేదా నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విత్తన దుకాణాలపై విస్తృత తనిఖీలు నిర్వహించి, నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకట రామారావు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రాయల రమేష్, బాధిత రైతుల పేర్ల బాధితరైతు ఉప్పెర్ల శ్రీను, ఉప్పెర్ల సత్యంగా, వాడవల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.