నాసిరకం పనులు చేస్తే బిల్లులు నిలిపివేస్తాం

కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హెచ్చరిక

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 6 :(సింగరేణి రిపోర్టర్ నరేష్) ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్పష్టం చేశారు. పొలంపల్లి నుంచి కోటిలింగాల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన రహదారి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే కాలినడకన దాదాపు రహదారి మొత్తం తిరుగుతూ జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యత, రోడ్డు వెడల్పు, పనుల పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో నిర్మిస్తున్న కల్వర్టుల పనులను కూడా పరిశీలించి పలు సాంకేతిక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, నాసిరకం పనులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ఆ నిధులు వృథా కాకుండా ప్రతి పని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. పనుల్లో ఏ మాత్రం నాణ్యత లోపం కనిపించినా సంబంధిత అధికారులతో మాట్లాడి బిల్లుల చెల్లింపులను నిలిపివేయించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా పనులను పర్యవేక్షించే అధికారుల బాధ్యత కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ, నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉన్నతాధికారులకు నివేదించి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీకి తావులేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే పొలంపల్లి, కోటిలింగాల పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పనులను పరిశీలించి నాణ్యతపై దృష్టి సారించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.