పయనించే సూర్యుడు న్యూస్ జూలై. 8 రిపోర్టర్. కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ భీమ్‌గల్ ప్రజల చిరకాల స్వప్నం, పోస్ట్ ఆఫీస్ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటకెక్కింది. పోస్ట్ ఆఫీస్ మంజూరై ఏడాది దాటినా, స్థలం కేటాయింపులో చోటుచేసుకుంటున్న జాప్యం వల్ల నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా ప్రభుత్వ నిధులు వృథాగా పడి ఉండటంతో పాటు, ప్రజలకు అందాల్సిన సేవలు అందని ద్రాక్షలా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి అవసరమైన 0.02 1/4 గుంటల స్థలం విషయంలో మున్సిపల్ అధికారులు, తహసీల్దార్ కార్యాలయాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. స్థలం కేటాయింపుపై అడిగితే, "తమకు సంబంధం లేద"ని మున్సిపల్ అధికారులు, "అది తమ పరిధిలోకి రాద"ని రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సైతం ఈ విషయాన్ని ఆమోదించి (CR నెం. 65/2025), తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. నిష్ప్రయోజనమైన ఫిర్యాదులు గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా, ఎటువంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, బాధ్యత గల అధికారుల నిర్లక్ష్యం వల్ల పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం నిలిచిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృథాగా నిధులు.. ఇబ్బందుల్లో ప్రజలు పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, స్థలం చూపించకపోవడంతో ఆ నిధులు వినియోగం కాకుండా వృథాగా పడి ఉన్నాయి. ఈ భవనం పూర్తయితే భీమ్‌గల్ ప్రజలకు విస్తృతమైన పోస్టల్ సేవలు అందుబాటులోకి వచ్చేవి. అయితే అధికారుల అలసత్వం వల్ల ప్రజలకు అందాల్సిన ఈ సౌకర్యం గగనంగా మారింది. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే స్థలాన్ని పోస్టల్ శాఖకు అప్పగించేలా ఆదే శాలు జారీ చేయాలని, నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కౌన్సిలర్ నీలం రవి మరియు భీమ్‌గల్ ప్రజలు కోరుతున్నారు.