నిధులు మంజూరైన రోడ్డుకు మోక్షం లేదు

★ రహదారి కోసం ఆదివాసుల ఆవేదన ★ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి –ఆదివాసీ నాయకుడు మెండి భాస్కర్ డిమాండ్

పయనించే సూర్యుడు, జూన్ 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం , వేపలగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు రహదారి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం మర్రికుంట నుంచి కొమ్మినేకరిపేట వరకు రహదారి నిర్మాణానికి సుమారు రూ.2 కోట్లు మంజూరైనప్పటికీ, అధికారులు కేవలం గ్రావెల్ వేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంజూరైన నిధులు ఏమయ్యాయో, రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తికాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు మెండి భాస్కర్ మాట్లాడుతూ, వేపలగడ్డ గ్రామపంచాయతీ నూటికి నూరు శాతం ఆదివాసులు నివసించే ప్రాంతమని, స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచినా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా వేపలగడ్డ ప్రజల కష్టాలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలం వచ్చిందంటే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, విద్యార్థులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు సరిగా లేక అంబులెన్స్ సైతం గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారిందన్నారు."రూ.2 కోట్లు మంజూరు చేసిన రహదారి పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఆ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది" అని మెండి భాస్కర్ ప్రశ్నించారు.అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే నాయకులు ముందుగా వేపలగడ్డ గ్రామ పరిస్థితిని పరిశీలించాలని, రోడ్డు వంటి కనీస అవసరాన్ని కూడా తీర్చలేకపోతే ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వచ్చే నైతిక హక్కు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మర్రికుంట–కొమ్మినకరిపేట రహదారి పనులపై విచారణ జరిపి, నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి పూర్తి చేయాలని, లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు."ఆదివాసుల అభివృద్ధి కేవలం మాటల్లో కాదు… చేతల్లో కనిపించాలి. వేపలగడ్డ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు. వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాలి" అని మెండి భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.