పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీపై సోషల్ మీడియా,కొన్ని మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మార్కెట్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.1966 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం ప్రకారమే మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నామని పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తెలిపారు. పలాసలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సేవలు ఆన్‌లైన్‌లోకి మారినట్లే మార్కెట్ సెస్ చెల్లింపులను కూడా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.ఈవిధానం కొత్తది కాదని,2018లోనే ప్రవేశపెట్టినప్పటికీ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 2026 జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ సెస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పలాస మార్కెట్ యార్డ్‌లో కూడా డీలర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వివరించారు.ఆన్‌లైన్ విధానం వల్ల డబుల్ టాక్సేషన్ జరుగుతుందనే ప్రచారంలోఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇది పన్ను (టాక్స్) కాదని, చట్టబద్ధమైన మార్కెట్ సెస్ మాత్రమేనని తెలిపారు. రైతుల వద్ద నుంచి జీడిపిక్కలు కొనుగోలు చేసే సమయంలో కొనుగోలు విలువపై 1 శాతం సెస్ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విధానం అమలుతో డీలర్లు మార్కెట్ కార్యాలయాలకు వచ్చి నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదని,చెల్లింపు పూర్తయిన వెంటనే రసీదు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల వ్యాపారులకు సమయం,ఖర్చు ఆదా కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సెస్ భారం తక్కువగానే ఉందని చెప్పారు.ఒడిశాలో జీడిపిక్కలపై అధిక సెస్ వసూలు చేస్తున్నారని,కర్ణాటకలో 1.25 శాతం సెస్ అమలులో ఉందని తెలిపారు.తమిళనాడు మినహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో మార్కెట్ సెస్ విధానం కొనసాగుతోందని వివరించారు.స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా జీడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.పరిశ్రమ అభివృద్ధి చెందితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం మార్కెట్క మిటీ,రైతులు,కార్మికులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మార్కెట్ కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దువ్వాడ శ్రీధర్ చేసిన ఆరోపణలు సరికావని లాయరు అయి కూడా ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం సరికాదని, తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితువు పలికారు..ఈ ప్రాంతంలోవ్యాపారులు, రైతులు,కార్మికులు దశాబ్దాలుగా పరస్పర సహకారంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని,అదే సహకార భావనతో ముందుకు సాగాలని కోరారు