పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 30 నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకన్న అని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గూడూరు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కటికాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జక్కా వెంకన్న భూస్వామి కుటుంబంలో జన్మించి పేదల హక్కుల కోసం జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన గొప్ప మార్క్ స్ట్ నాయకుడని 1930 నవంబర్ మూడున నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా దామరమడుగు గ్రామంలో జక్కా రమణారెడ్డి,శంకరమ్మ దంపతులకు జన్మించారని, ప్రాథమిక విద్య దామరమడుగులో ,ఉన్నత విద్య బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరులో కొనసాగిందని ,దక్షిణ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య పెద్దమ్మ మనవడు కావడం వల్ల చిన్నతనం నుంచే ఆయన భావజాలంతో ప్రభావితులయ్యారని, సుందరయ్య స్ఫూర్తితో తన పేరులోని కుల చిహ్నమైన రెడ్డిని తొలగించుకొని చట్టబద్ధంగా వెంకయ్యగా మార్చుకున్నారని, అంతేకాకుండా తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని సైతం పేదలకు పార్టీకి అంకితం చేశారని, జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక కార్యదర్శిగా 1967 లో బాధ్యతలు చేపట్టి నిరుపేదలకు వేలాది ఎకరాల భూములు దక్కేలా భూపారాటాలను నడిపారని, ప్రజా ప్రతినిధిగా 1985 మరియు 1994 లలో నెల్లూరు జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సమస్యలపై శాసనసభలో గళం వినిపించారని, ఆయన చివరి శ్వాస విడిచేంతవరకు మార్క్ స్ట్ సిద్ధాంతాలకు కట్టుబడి సామాన్య జీవితం గడిపారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం పార్టీ కార్యదర్శి జోగి శివకుమార్ నాయకులు పామంజి మణి, బి.వి.రమణయ్య అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, పి.శ్రీనివాసులు,ఎస్.డి. రఫీ, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.