నేడు వంజరి కుల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం

- ముఖ్య అతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - భారీగా తరలిరావాలని సంఘం నాయకుల పిలుపు

పయనించే సూర్యడు / జూన్ 07/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలంగాణ వంజరి సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'వంజరి కుల ఆత్మగౌరవ భవనం' ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కుల బాంధవుల చిరకాల స్వప్నం సాకారమవుతున్న తరుణంలో, ఆదివారం జరగనున్న ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించనున్నారు. కుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు సంఘం కార్యవర్గం అన్ని చర్యలు పూర్తి చేసింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భానుక నర్రెడ్డి మల్లికార్జున, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని వేడుకను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కులానికి ఒక సొంత భవనం ఉండాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ఆత్మగౌరవ భవనం, భవిష్యత్తులో సామాజిక, విద్యా మరియు ఆర్థిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా నిలవనుంది. వంజరి కుల అభివృద్ధిలో ఈ భవనం కీలక పాత్ర పోషించనుందని సంఘం నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కాలేరు నరేందర్, ప్రధాన కార్యదర్శి కే. వెంకటేశం, కార్యనిర్వహణ కార్యదర్శి వంజరి కరిపె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… కుల బాంధవులందరూ ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలవాలని కోరారు. కుల సంఘ సభ్యులు, సామాజికవేత్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.