ప యనించే సూర్యుడు జులై 4 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పంటచెలలో నిలిచిన నీరు పంటబోదెల ద్వారా క్రిందకు దిగకపోవడంతో పంటచేలు ముంపునకు గురై సాగుకు నోచుకోలేదని ఉప్పూడి గ్రామ రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం అయినాపురం కెనాల్ నుండి ఉప్పూడి గ్రామం మీదుగా ప్రవహించే పంటబోదెను కొంతమంది ఆక్వా రైతులు పూడ్చివేయడంతో పంటచేలు నాశనమవుతున్నాయి. ఉప్పూడి గ్రామంలో సుమారు 450 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వరి సాగు ద్వారానే కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఉప్పూడి గ్రామం నుండి కాట్రేనికోన మెయిన్ ఉప్పు కాలువ వరకు సుమారు రెండు వందల మీటర్ల మేర పంటబోదెను ర్యాలీ శివరావు, ఉయ్యూరు గోపాలం, ర్యాలీ శ్రీరామ్మూర్తి అనే రైతులు రొయ్యల సాగు కోసం పూడ్చివేశారని ఆరోపించారు. ఈ విషయంపై గత నెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుండి ఎటువంటి పరిష్కారం రాలేదని మీడియాకు తెలిపారు. వరి సాగు చేసే రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ముంపునకు గురైన వరిచేలను తిరిగి సాగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, పూడ్చివేసిన పంటబోదెలను తవ్వించాలని కోరారు. రెండు రోజుల్లో ముంపు నీరు తొలగించేందుకు పరిష్కారం చెప్పకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఏ వెంకటపతి రాజు, ఎం మల్లేశ్వరావు, పి నాగబాబు, ఎం శ్రీనివాసరావు, పరమట సత్యనారాయణ, మాగాపూ రామకృష్ణ, పోలిశెట్టి అమ్మిరాజు, ఎంవివి సత్యవేణి, అన్నంనీడి సుబ్బలక్ష్మి, దామిశెట్టి మహాలక్ష్మి, నల్లా చందర్రావు, పి సత్యవతి, ఎన్ రామకృష్ణ, బి గోపాలకృష్ణ, ఉంగరాల వీరవేణి తదితరులు పాల్గొన్నారు.